Bengaluru Crime: కుటుంబ కలహాలు ఏడుగురి ప్రాణాలను బలిగొన్నాయి. భార్యతో తరచూ గొడవలు పడుతున్న ఓ క్యాబ్ డ్రైవర్.. ఆమె కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకుని ఏడుగురిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
భార్యతో పాటు అత్త, ఇద్దరు బావమరుదులు, వారి భార్యలు, ఏడేళ్ల బాలుడిని కూడా హతమార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసులో నిందితుడు ఇందుశేఖర్‌ను రాజాజీనగర్ పోలీసులు అరెస్టు చేశారు.
Read Also :Bank robbery: పట్టపగలే బ్యాంకు దోపిడీ.. రూ. 4 కోట్ల సొత్తు అపహరణ!
20 ఏళ్ల వైవాహిక జీవితంలో తరచూ గొడవలు
పోలీసుల కథనం ప్రకారం.. ఇందుశేఖర్‌కు సునీతతో సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే సునీత తన పుట్టింటి వారితో సన్నిహితంగా ఉండటం అతడికి నచ్చేది కాదు. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. సునీతకు ఆమె తల్లి, సోదరులు అండగా నిలవడంతో వారిపై కూడా ఇందుశేఖర్ ద్వేషం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఏడుగురిని హత్య చేసేందుకు ముందుగానే పథకం వేసినట్లు వెల్లడించారు.
భార్యను హత్య చేసి.. కుటుంబ సభ్యులను నమ్మించిన నిందితుడు

మొదట తన ఇంట్లోనే భార్య సునీతను రోకలిబండతో కొట్టి హత్య చేసినట్లు నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. అనంతరం సునీత తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిందని కుటుంబ సభ్యులను నమ్మించాడు. ఆ తర్వాత మద్యం తాగుదామంటూ బావమరుదులు శివకుమార్, శంకర్‌లను ఇంటికి పిలిచి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి భార్యలు దివ్య, నళినితో పాటు అత్త రూపావతి, ఏడేళ్ల బాలుడు పునీత్‌ను కూడా నిందితుడు హతమార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నళిని కనిపించకపోవడంతో వెలుగులోకి ఘటన
నళిని కనిపించకుండా పోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇందుశేఖర్‌ను ప్రశ్నించారు. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం అతడి ఇంట్లో లభించిన ఆధారాల ఆధారంగా విచారించగా హత్యల విషయం బయటపడినట్లు పోలీసులు తెలిపారు.
చిక్‌బళ్లాపూర్‌లో బాలుడి మృతదేహం గుర్తింపు
మృతదేహాలను నంది హిల్స్ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల పడేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. దీంతో పోలీసులు అక్కడ గాలింపు చేపట్టారు. గురువారం సుమారు నాలుగు గంటలపాటు గాలించి చిక్‌బళ్లాపూర్ జిల్లాలో ఏడేళ్ల పునీత్ మృతదేహాన్ని గుర్తించారు. మిగిలిన ఆరుగురి మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. హత్యలకు ఉపయోగించిన రోకలిబండను కడిగేసినట్లు, ఇంట్లోని రక్తపు మరకలను శుభ్రం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను తరలించేందుకు ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
Bengaluru Crime: పత్రిక నిర్వహిస్తున్న నిందితుడు
ఇందుశేఖర్ 'తానా వరది' పేరుతో ఓ పత్రికను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా భాష్యం సర్కిల్ సమీపంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు వెల్లడించారు. ఇంటి యజమానితో ఉన్న వివాదం కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెస్ట్ డివిజన్ జాయింట్ కమిషనర్ వంశీకృష్ణ, నార్త్ డివిజన్ డీసీపీ నేమగౌడ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.

