Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.
ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్‌కు సంబంధించిన గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు పవర్ హౌస్ నిర్మాణ పనుల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం, అనంతరం ప్రాజెక్టు సైట్ నుంచే రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టులపై వర్చువల్‌గా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

read also: CM Chandrababu: పోలవరం ప్రాజెక్టును హెలికాప్టర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన బాబు
మూడేళ్లలో 36 ప్రాజెక్టుల పూర్తి: రూ.35,313 కోట్ల కేటాయింపు
రాష్ట్రంలోని 36 కీలక సాగునీటి ప్రాజెక్టులను రాబోయే మూడేళ్ల కాలంలో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ భారీ లక్ష్యం కోసం రూ.35,313 కోట్లు వెచ్చించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతి వంటి ముఖ్యమైన అంశాలపై అధికారులతో చర్చించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలాంటి జాప్యం జరగకూడదని, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
Chandrababu Naidu: రూ.3,883 కోట్లతో సాగునీటి పథకాల పునరుద్ధరణ
రాష్ట్రవ్యాప్తంగా రైతాంగానికి మేలు చేసేలా ఏపీఎస్ఐడీసీ (APSIDC) ద్వారా 1,023 సాగునీటి పథకాల పునరుద్ధరణ పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.3,883 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 8.42 లక్షల ఎకరాల ఆయకట్టుకు శాశ్వతంగా సాగునీరు అందుతుందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. దీనితో పాటు కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ ఆధునీకరణ ప్రాజెక్టు కింద పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ప్రత్యేక పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
‘జలధార’ పనులకు నిధుల విడుదల.. ఉపాధి హామీలో రికార్డు
భూగర్భ జలమట్టాలను పెంచే లక్ష్యంతో చేపట్టిన ‘జలధార’ కార్యక్రమం తీరును కూడా సీఎం చంద్రబాబు సమీక్షించారు. గడిచిన 100 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 11,133 చెరువులు, ఫీడర్ ఛానళ్ల అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఈ పనులను వీబీజీ రామ్ జి సంస్థ ద్వారా త్వరితగతిన పూర్తి చేయాలని, జలధార పనుల కోసం ప్రతి జిల్లాకు తక్షణమే రూ.2 కోట్ల చొప్పున నిధులను విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. కాగా, ఈ ఏడాది దేశంలోనే అత్యధికంగా రూ.2,500 కోట్లను ఉపాధి హామీ పథకం కింద ఏపీలో ఖర్చు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

Epaper: epaper.vaartha.com

