Rangareddy Murder Case: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతాల్లో జరిగిన అత్యంత కిరాతకమైన ఆరుగురి హత్యలపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రాజస్థాన్ అధికారిక పర్యటనలో ఉన్న మంత్రి, ఈ ఘోర ఘటన వివరాలు తెలియగానే తక్షణమే స్పందించారు. సంబంధిత పోలీస్ కమిషనర్‌తో ఫోన్ ద్వారా మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. సమాజం తలదించుకునేలా ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై అత్యంత కఠినమైన సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని, కేసు దర్యాప్తును రికార్డు సమయంలో వేగవంతం చేయాలని పోలీసు ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. బాధితుల బంధువులకు తక్షణం అవసరమైన సహాయం అందించాలని, వారికి మానసిక-సామాజిక తోడ్పాటు కల్పించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇలాంటి అనాగరిక నేరాలకు పాల్పడే నేరస్థులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని సీతక్క తీవ్రంగా హెచ్చరించారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని స్పష్టం చేశారు.
Minister Seethakka responds to the murders in Ranga Reddy district.
Rangareddy Murder Case: పోక్సో కేసు కక్షతోనే ఘాతుకం.. అసలు ఏం జరిగిందంటే?
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ దారుణ హత్యల వెనుక ఉన్న వెన్నులో వణుకుపుట్టించే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడైన రాజ్‌కుమార్ (28) అనే వ్యక్తి తనపై గతంలో పోక్సో (POCSO) కేసు నమోదు చేయించి జైలుకు పంపారనే కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను జైలుకు పంపిన సదరు బాలిక, ఆమె తల్లి, మరియు నానమ్మను కత్తితో అత్యంత క్రూరంగా నరికి చంపాడు. అంతటితో ఆ ఉన్మాది ఆగ్రహం చల్లారలేదు.. ఆ తర్వాత తన స్వంత కుటుంబంపై పడి తన భార్య సరిత (పార్వతి సరిత), కేవలం 3 ఏళ్ల వయసున్న కుమార్తె, 2 ఏళ్ల కుమారుడిని కూడా కిరాతకంగా హతమార్చాడు. ఈ ఒకే ఒక్కడి ఉన్మాదానికి రెండు కుటుంబాలకు చెందిన మొత్తం ఆరుగురు నిరపరాధులు బలయ్యారు.
బెయిల్‌పై విడుదలైన కొన్ని గంటల్లోనే మారణకాండ
గత మే 16న మైనర్ బాలికను వేధించాడనే ఆరోపణలపై ఆ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాబాద్ పోలీసులు రాజ్‌కుమార్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసులో మే 26న పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, జైలులో ఉంటూ కక్ష పెంచుకున్న రాజ్‌కుమార్, శుక్రవారం బెయిల్‌పై జైలు నుండి విడుదలయ్యాడు. విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే పక్కా ప్లాన్‌తో కత్తితో ఈ మారణకాండకు ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

