Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (జూన్ 8) పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'మీ భూమి-మీ హక్కు' భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో ఆయన భాగస్వాములు కానున్నారు.
ఆచంట నియోజకవర్గ పరిధిలోని సిద్ధాంతం గ్రామంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని, రైతులకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను స్వయంగా పంపిణీ చేయనున్నారు. అనంతరం స్థానిక రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సాధకబాధకాలను తెలుసుకోనున్నారు.

పారదర్శక పద్ధతిలో కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ
గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డులు, పాస్‌పుస్తకాల్లో దొర్లిన అనేక తప్పులను సరిదిద్దడమే లక్ష్యంగా ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూ యజమానుల సమక్షంలోనే క్షేత్రస్థాయిలో రీ-సర్వే నిర్వహించి, వారి పూర్తి అంగీకారం తీసుకున్న తర్వాతే తుది రికార్డులను ఖరారు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో మరింత పారదర్శకత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెల నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి, అధికారుల చేత భూ వివరాలను చదివించి మరీ రైతులకు కొత్త పాస్‌పుస్తకాలను అందజేస్తున్నారు.
Chandrababu Naidu: ఆరు నెలల్లో 26 లక్షలకు పైగా పాస్‌పుస్తకాలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేసింది. గడిచిన జనవరి నెల నుండి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,688 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయింది. ఇందులో 6,459 గ్రామాలకు చెందిన దాదాపు 26.46 లక్షల మంది రైతులకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను ప్రభుత్వం విజయవంతంగా పంపిణీ చేసింది. రాబోయే 9 నెలల కాలంలో మరో 10,357 గ్రామాల్లో రీ-సర్వేను ముగించి, అదనంగా 67.32 లక్షల పాస్‌పుస్తకాలను అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు.
దేశంలోనే తొలిసారిగా 'బ్లాక్‌చైన్' భూ రికార్డులు
భూ రికార్డుల భద్రతలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విప్లవానికి తెరలేపింది. దేశంలోనే మొదటిసారిగా భూముల వివరాల రక్షణ కోసం ‘బ్లాక్‌చైన్ సాంకేతికత’ను (Blockchain Technology) అమలు చేస్తోంది. దీని ద్వారా ప్రతి భూ విభాగానికి (Land Unit) ఒక శాశ్వతమైన డిజిటల్ బ్లాక్‌చైన్ ఐడీని కేటాయిస్తారు. ఫలితంగా భూ రికార్డులను ఎవరూ తారుమారు చేయలేరు. అలాగే సర్వే ప్రారంభం నుండి తుది పత్రాల జారీ వరకు ప్రతి దశలోనూ లబ్ధిదారుల ఈ-కేవైసీ (e-KYC) విధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
ముఖ్యమంత్రి పర్యటన పూర్తి షెడ్యూల్
సోమవారం (జూన్ 8) ఉదయం 10:25 గంటలకు అమరావతి నుండి సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి పర్యటనకు బయలుదేరుతారు. ఉదయం 11:00 గంటలకు ఆయన సిద్ధాంతం గ్రామానికి చేరుకుంటారు. అనంతరం 11:15 గంటలకు ఏర్పాటు చేసిన 'మీ భూమి-మీ హక్కు' ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు రైతులతో ప్రత్యేకంగా భేటీ అయి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం 3:15 గంటలకు తెలుగుదేశం పార్టీ (TDP) స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని సాయంత్రం 5:35 గంటలకు తిరిగి అమరావతికి చేరుకుంటారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:
ఏపీలో రేపటి నుంచే టెన్త్ సప్లిమెంటరీ పేపర్ల మూల్యాంకనం..రిజల్ట్స్ ఎప్పుడంటే?

