TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
మరోవైపు దసరా సెలవులు కూడా కొనసాగుతుండటంతో కొండపై భక్తుల రద్దీ భారీగా ఉంది.
AP High Court: చిన్నారి మిస్సింగ్ కేసుపై హైకోర్టు సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు
అయినప్పటికీ సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, త్వరగా దర్శనం లభించేలా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం క్యూలైన్లలోకి ప్రవేశించిన కేవలం మూడున్నర గంటల్లోపే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.

ప్రత్యేక దర్శనాలు రద్దు
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు స్లాటెడ్ సర్వదర్శనం , వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్నారైలకు కల్పించే ప్రత్యేక దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ నిర్ణయం వల్ల క్యూలైన్లలో రద్దీ తగ్గి, సామాన్య భక్తులకు వేగంగా దర్శనం లభించే అవకాశం ఏర్పడింది.
భారీగా తరలివస్తున్న భక్తులు..
శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అక్టోబర్ 12న 83,322 మంది, 13న 84,179 మంది, 14న 84,289 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీని సమర్థవంతంగా మేనేజ్ చేస్తూ ప్రతి గంటకు సుమారు 4 వేల మంది భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
వసతి గదుల కేటాయింపులోనూ ప్రాధాన్యం
దర్శనంతో పాటు వసతి గదుల కేటాయింపులోనూ సామాన్య భక్తులకే టీటీడీ తొలి ప్రాధాన్యం ఇస్తోంది. బ్రహ్మోత్సవాల రద్దీ సమయంలోనూ రోజుకు సుమారు 4 వేల గదులను కేవలం సామాన్య భక్తులకే కేటాయిస్తున్నారు. భక్తులకు గదులు త్వరగా, సులభంగా లభించేలా రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు.
అన్నప్రసాదాలు, లడ్డూల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు
తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి సంతృప్తికరంగా అన్నప్రసాదాలు అందించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రోజుకు సుమారు 9 లక్షల లడ్డూలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతున్నారు. ప్రత్యేకంగా గరుడసేవ రోజున క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మజ్జిగ, జ్యూస్ ప్యాకెట్లు, బిస్కెట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

