Indian Railways Expansion: దేశవ్యాప్తంగా రైలు అనుసంధానాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రయాణీకుల, సరుకుల రవాణా సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం బృహత్తర అడుగు వేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) బుధవారం రోజున తొమ్మిది రాష్ట్రాల వ్యాప్తంగా రూ. 20,804 కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది ప్రధాన రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దాదాపు 1,196 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుత కీలక రైలు మార్గాలలో రద్దీ గణనీయంగా తగ్గి, సరుకులు, ప్రయాణికుల రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టులన్నింటినీ 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆమోదించిన ఎనిమిది ప్రాజెక్టులలో రూ. 10,021 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులు దక్షిణ-మధ్య భారతదేశంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో 540 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి.
Indian Railways Expansion
Indian Railways Expansion: ఐదు ప్రాజెక్టులు 17 జిల్లాల గుండా వెళ్తాయి
వీటిలో అరక్కోణం-రేణిగుంట మధ్య 77 కిలోమీటర్ల 3వ, 4వ లైన్లు, వైట్‌ఫీల్డ్-బంగారపేట మధ్య 47 కిలోమీటర్ల 3వ, 4వ లైన్లు, హోసూర్-ఓమలూర్ మధ్య 147 కిలోమీటర్ల డబ్లింగ్, సేలం-కరూర్-దిండిగల్ మధ్య 159 కిలోమీటర్ల డబ్లింగ్, సికింద్రాబాద్ (ఘట్‌కేసర్)-కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ఐదు ప్రాజెక్టులు 17 జిల్లాల గుండా వెళుతూ.. 2,121 గ్రామాలకు ప్రత్యక్ష అనుసంధానాన్ని కల్పిస్తాయి. దీనివల్ల దాదాపు 52 లక్షల మంది ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.

