TRS Party Name: తెలంగాణ రక్షణ సమితి (TRS) పార్టీ పేరు రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
తన నూతన పార్టీకి ‘తెలంగాణ రక్షణ సమితి’ అనే పేరును అధికారికంగా కేటాయించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని (EC) ఆదేశించాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
Read Also:Kannepalli Pump House : 'ప్రజలను శిక్షించకండి' అంటూ సీఎం రేవంత్ కు ఈటల సూచన
ముందు ఈసీకి సమాధానం చెప్పండి – హైకోర్టు హితవు

తమ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలపై ఢిల్లీ హైకోర్టు సుదీర్ఘంగా విచారించింది. ‘తెలంగాణ రక్షణ సమితి’ (TRS) అనే పేరుతో కొత్త పార్టీని రిజిస్టర్ చేయడంపై ఇప్పటికే పబ్లిక్ నోటీసుల ద్వారా తీవ్రమైన అభ్యంతరాలు, ఫిర్యాదులు వ్యక్తమయ్యాయని న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని, దాని విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈసీ లేవనెత్తిన సాంకేతిక, చట్టపరమైన అభ్యంతరాలకు ముందుగా సరైన రీతిలో వివరణలు, సమాధానాలు ఇచ్చుకోవాలని కవితకు సూచించింది. ఆ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాతే అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేస్తూ పిటిషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది.
TRS Party Name: ఉత్కంఠ రేపుతోన్న పొలిటికల్ మూవ్స్
తెలంగాణలో సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు కవిత ‘తెలంగాణ రక్షణ సమితి’ (TRS) పేరుతో రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ప్రాంతీయంగా ఒక వెలుగు వెలిగిన పాత పార్టీ పేరును (తెలంగాణ రాష్ట్ర సమితి – TRS) పోలి ఉండేలా ఈ కొత్త పేరు ఉండటంతో.. దీనిపై సాంకేతికంగా, రాజకీయంగా పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసీ నుంచి వచ్చిన నోటీసులపై నేరుగా కోర్టుకు వెళ్లిన కవితకు.. ముందుగా ఎన్నికల సంఘం వేదికగానే ఈ వివాదాన్ని తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి తదుపరి ఈసీ విచారణపై పడింది.
Epaper: epaper.vaartha.com

