Konaseema Fishermen Rescued: కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారుల కోసం కొనసాగిన గాలింపు చర్యలకు ఎట్టకేలకు ఫలించాయి. వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరానికి సురక్షితంగా చేరుకున్నారు.
మత్స్యకారులు క్షేమంగా ఉన్నారనే వార్త తెలియగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. గాలింపు చర్యల్లో అహర్నిశలు శ్రమించి వారిని రక్షించిన అధికార యంత్రాంగాన్ని, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ నెల 3న కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. సముద్రంలో బోటు సాంకేతిక లోపానికి గురికావడంతో పాటు బలమైన ఈదురు గాలులు వీయడంతో అది పశ్చిమ బెంగాల్ తీరం వైపు కొట్టుకుపోయింది.
Konaseema fishermen reach shore safely; Chandrababu expresses happiness.
Konaseema Fishermen Rescued: ప్రభుత్వం తక్షణ స్పందన.. గాలింపు చర్యలు
మత్స్యకారులు గల్లంతైన విషయాన్ని తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించారు. గాలింపు చర్యలను తక్షణమే ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించడమే కాకుండా, స్వయంగా మంత్రులను రంగంలోకి దింపి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. సముద్ర ప్రవాహాలు, గాలుల దిశను బట్టి బోటు బెంగాల్ వైపు కొట్టుకుపోయి ఉండవచ్చని అంచనా వేసిన ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ విభాగాల సహాయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ కోస్ట్ గార్డ్‌తో పాటు అక్కడి శంకర్‌పూర్ ఫిషింగ్ హార్బర్‌లోని స్థానిక మత్స్యకారులను ముందస్తుగా అప్రమత్తం చేసింది.
స్వస్థలాలకు తరలింపునకు ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ముమ్మర ప్రయత్నాలు ఫలించడంతో పశ్చిమ బెంగాల్‌లోని శంకర్‌పూర్ సమీపంలో బోటుతో సహా ఏడుగురు మత్స్యకారులను అధికారులు గుర్తించారు. వారు సురక్షితంగా ఉన్నారనే సమాచారం అందగానే వెంటనే కుటుంబ సభ్యులకు చేరవేసి వారి ఆందోళనను తొలగించారు. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న మత్స్యకారులను క్షేమంగా తమ స్వస్థలాలకు తీసుకురావడానికి అవసరమైన అన్ని రవాణా, సహాయక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు.

