Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉద్యోగం, ఆస్తి కోసం కన్నతల్లినే సుపారీ ఇచ్చి చంపించిన కూతురు!

ఉద్యోగం, ఆస్తి కోసం కన్నతల్లినే సుపారీ ఇచ్చి చంపించిన కూతురు!

వార్త 2 weeks ago

Jaipur Crime: ఆస్తి దురాశ, ప్రభుత్వ ఉద్యోగంపై మోజు కన్నప్రేమను వెక్కిరించింది. తల్లిని వదిలించుకుంటే ఆమె చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కోట్లాది రూపాయల ఆస్తి తనకే దక్కుతుందని ఆశపడిన ఓ కూతురు..

బాబాయ్, బావలతో కలిసి కన్నతల్లినే లారీలను మించిపోయేలా ప్లాన్ చేసి హతమార్చింది. ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఈ హై-ప్రొఫైల్ మర్డర్ కేసు మిస్టరీని జైపూర్ పోలీసులు ఛేదించారు. కూతురితో సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Read Also :West Bengal Crime: పాపం పండింది.. బరైపూర్ బాలిక హత్యాచార కేసు నిందితుడు ఎన్‌కౌంటర్

అసలేం జరిగింది? – రోడ్డు ప్రమాదం వెనుక అసలు నిజం

జైపూర్ కోర్టులో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)గా పనిచేస్తున్న నీరజ్ శర్మ (45) జులై 3న సాయంత్రం తన కుమారుడిని కోచింగ్ సెంటర్ వద్ద దించి స్కూటీపై ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 4:45 గంటల ప్రాంతంలో వెనుక నుంచి దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఒక స్కోర్పియో ఎస్‌యూవీ (Scorpio SUV) ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు నీరజ్ శర్మ వంద అడుగుల దూరంలో పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ కారును వదిలేసి పరారయ్యాడు. మొదట దీన్ని సాధారణ హిట్ అండ్ రన్ కేసుగా భావించినప్పటికీ, ఘటనా స్థలంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు దిగ్భ్రాంతికర విషయాలు తెలిశాయి. కారు కావాలనే వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు గుర్తించిన పోలీసులు.. ఇది పక్కా స్కెచ్ ప్రకారం జరిగిన హత్యగా తేల్చారు.

7 లక్షల సుపారీ – కారుణ్య నియామకం కోసమే కుట్ర

తూర్పు జైపూర్ డీసీపీ రంజిత శర్మ ఈ హత్య వెనుక ఉన్న కుటుంబ సభ్యుల కుట్రను లోతుగా దర్యాప్తు చేసి గుట్టురట్టు చేశారు. మృతురాలు నీరజ్ శర్మ భర్త ఏడాది క్రితం మరణించడంతో ఆమెకు కారుణ్య నియామకం (Compassionate Appointment) కింద కోర్టులో ప్రభుత్వ ఉద్యోగం లభించింది. అయితే, ఆమె కూతురు ఆయుషి శర్మ ఆ ఉద్యోగాన్ని తానే దక్కించుకోవాలని ఆశపడింది. తల్లి ఉద్యోగంలో చేరడం ఆమెకు నచ్చలేదు. దీనికి తోడు గత రెండేళ్లుగా వీరి మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. తల్లిని చంపేస్తే కారుణ్య నియామకం కింద ఆ ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆస్తి మొత్తం తనకే వస్తుందని ఆయుషి ప్లాన్ చేసింది. ఇందుకు తన బాబాయ్ మోహన్ స్వరూప్, బావ బలరామ్‌లతో చేతులు కలిపింది. భరత్‌పూర్‌కు చెందిన హేమంత్ శర్మ అనే రౌడీ షీటర్‌కు రూ. 7 లక్షల సుపారీ (హత్య కాంట్రాక్ట్) ఇచ్చి తల్లిని అంతమొందించే బాధ్యత అప్పగించింది.

Jaipur Crime: నెల రోజుల పాటు రెక్కీ – లొకేషన్ ట్రాక్ చేసి మరీ విరుచుకుపడ్డారు

హత్య కోసం నిందితులు మొదట ఒక ‘థార్’ (Thar) వాహనాన్ని అద్దెకు తీసుకుని నెల రోజుల పాటు నీరజ్ శర్మ కదలికలపై నిఘా ఉంచారు (రెక్కీ నిర్వహించారు). జులై 3న పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు. మోహిత్ శర్మ అనే నిందితుడు నీరజ్ శర్మ లైవ్ లొకేషన్‌ను ట్రాక్ చేసి సమాచారం అందించగా, ఆకాష్ శర్మ, అరవింద్ శర్మలు స్కోర్పియో కారుతో వేగంగా వచ్చి ఆమెను వెనుక నుంచి ఢీకొట్టారు. అనంతరం కారును అక్కడే వదిలేసి ముందుగానే సిద్ధం చేసుకున్న బైక్‌పై పరారయ్యారు.

మృతురాలి సోదరుడు రాకేష్ కుమార్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును వేగవంతం చేశారు. ఆస్తి కోసం తన సోదరిని కూతురు, అత్తగారింటి వాళ్లు వేధిస్తున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నట్లు నీరజ్ శర్మ గతంలోనే తనకు చెప్పిందని ఆయన పేర్కొన్నారు. పోలీసులు ప్రస్తుతం ప్రధాన నిందితురాలు ఆయుషి శర్మతో పాటు మోహన్ స్వరూప్, మోహిత్ శర్మ, ఆకాష్ శర్మ, అరవింద్ శర్మ, హేమంత్ శర్మ, రోహిత్ జాతవ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో ముఖ్య నిందితుడు బలరామ్ కోసం గాలిస్తున్నారు.

భర్త కనిపిచడంలేదంటూ పోలీసులుకు ఫిర్యాదు.. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha