AP Employment Guarantee Act: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న జి రామ్ జి చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామని సిపిఐ జాతీయ నాయకులు డి.
రాజా, కె. రామకృష్ణ హెచ్చరించారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో గురువారం ప్రారంభమైన బికెఎంయూ జాతీయ కౌన్సిల్ సమావే శాల్లో భాగంగా నిర్వహించిన జాతీయ సెమినార్లో రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. బికెఎంయూ జాతీయ అధ్యక్షుడు పెరియార్ స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 18 సిపిఐ జాతీయ కార్యదర్శులు డి.రాజా, కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జల్లి విల్సన్, గుల్జార్ సింగ్ గోరియా, ఆవుల శేఖర్, ఆర్. వెంకట్రావు, ఎంఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు సభికులను ఆకట్టుకున్నాయి. అనంతరం జి రామ్ జి చట్టాన్ని రద్దు చేసి ప్రస్తుతం అమలులో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
Ongole G. Ramji’s Struggles Against Unjust Laws
ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఎ ప్రభుత్వం పేదల జీవనాధారాలపై పద్దతిగా దాడులు చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి రాకముందు పేదరికాన్ని నిర్మూలిస్తామని, కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే పనిలో పడ్డారని ఆరోపించారు. గ్రామీణ పేదలకు కనీస ఉపాధి భరోసా కల్పించే ఈ చట్టానికి ఏడాదికి భారీగా నిధులు కేటాయించాల్సి ఉండగా ఉద్దేశపూర్వకంగా అరకొర నిధులు కేటాయిస్తూ బలహీనపరుస్తున్నారని అన్నారు. 100 రోజుల పనికి హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 50 రోజులకే పరిమితం చేస్తోందని, కూలీలకు రావాల్సిన వేతనాలను కూడా నెలల తరబడి చెల్లించడం లేదని విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ పేదల జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడుతోందని డి. రాజా మండిపడ్డారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని, మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఆరోగ్య సేవలు పేదలకు అందని ద్రాక్షలా మారిపోయాయని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను అణగదొక్కుతూ కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణిలో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
AP Employment Guarantee Act:కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన
ఇప్పటికైనా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు ఐక్యంగా ముందుకు వచ్చి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు. దేశంలోని గ్రామీణ పేదలకు జీవనాధారంగా నిలిచిన ఈ చట్టాన్ని సమాధి చేయాలని కేంద్రం ప్రయత్నించడం దుర్మార్గమని విమర్శించారు. దేశంలో సుమారు 40 శాతం మంది ఈ చట్టం ద్వారా ఉపాధి పొందుతున్నారని, అలాంటి చట్టాన్ని ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని, సెప్టెంబర్ 15న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇస్తామని కె.రామకృష్ణ ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రజలంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ జి రామ్ జి చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. గ్రామీణ పేదల జీవనోపాధిని దెబ్బతీసే ఈ చట్టంపై ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

