Suryapet Crime: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో ఒక చిన్న చెట్టు వివాదం దారుణమైన రక్తపాతానికి దారితీసింది. ఇంటి పక్కనే ఉన్న వేపచెట్టు విషయమై రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్రరూపం దాల్చి ఇద్దరి ప్రాణాలను బలిగొంది.
Read Also :Minor Assault Case Odisha: 9వ తరగతి బాలిక గర్భవతిగా గుర్తింపు.. ట్యూటర్ అరెస్ట్
గొడ్డళ్లతో దాడులు… అక్కడికక్కడే ఇద్దరు మృతి

మాటామాటా పెరిగి కోపంతో ఊగిపోయిన ఇరు వర్గాల ప్రజలు విచక్షణ కోల్పోయి గొడ్డళ్లతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో గొడ్డలి వేట్లకు గురైన ఇద్దరు వ్యక్తులు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణ తీవ్రతను గమనించి దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మేళ్లచెరువు ఎస్ఐ నవీన్‌కుమార్‌పై కూడా దాడులు జరగడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
Suryapet Crime: తండాలో ఉద్రిక్తత… భారీ బందోబస్తు
ఓ చిన్న వేపచెట్టు వివాదం ఇద్దరి ప్రాణాలు తీయడమే కాకుండా, శాంతిభద్రతలను కాపాడే పోలీసులపైకే దాడికి దిగే స్థాయికి వెళ్లడంతో ఎర్రగడ్డతండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తండాలో మళ్లీ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

