48 గంటల్లో రైతులకు చెల్లింపులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Paddy Procurement: యాసంగి సీజన్లో వరి కొనుగోళ్లకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు.
ఈ మేరకు మంగళవారం హుజూర్ నగర్ మార్కెట్ యార్డులో వరి కొనుగోళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ… ఈ యాసంగి సీజన్లో సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రబి వరి ఉత్పత్తి 148 లక్షల మెట్రిక్ టన్నులకు మించనున్న నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

Paddy Procurement: కొనుగోలు కేంద్రాలు, వసతులు
రైతులకు 48 గంటల్లో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,251 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నిల్వ గోదాములు, రవాణా సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే 16 కోట్లకుపైగా గన్నీ సంచులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ప్రతీ కేంద్రంలో ఒక అధికారిని నియమించి కొనుగోళ్లు, నాణ్యత తనిఖీలు, చెల్లింపులు పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షణ చేయిస్తామని పేర్కొన్నారు.
మద్దతు ధర, నిబంధనలు
కొనుగోళ్లలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. సాధారణ వరి రకానికి క్వింటాల్కు రూ.2,369, మెరుగైన రకానికి రూ. 2,389 కనీస మద్దతు ధర రైతులకు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కస్టమ్ మిల్డ్ రైస్ (సిఎంఆర్) కింద ఉడకబెట్టిన బియ్యం కొనుగోలు విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కోటాను తగ్గించడం, అలాగే బియ్యంలో బ్రోకెన్ రైస్ శాతం తగ్గించాలనే కఠిన నిబంధనలపై రైస్ మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
అక్రమ రవాణాపై నిఘా
ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, మిల్లర్లు, కేంద్ర ఆహార మంత్రిత్వశాఖతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద వరి ధాన్యం అక్రమ రవాణాపై కఠిన నిఘా ఉంచుతున్నామని, ఇతర రాష్ట్రాల వరి తెలంగాణ కొనుగోలు కేంద్రాలకు అనుమతించబోమని మంత్రి స్పష్టం చేశారు. గత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రం సుమారు 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసి రికార్డు సృష్టించిందని గుర్తుచేశారు. ఆ సీజన్లో రైతుల ఖాతాల్లో రూ. 19,500 కోట్లకు పైగా నేరుగా జమ చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి కేటాయించిన నదీ జలాలను సమర్థంగా వినియోగిస్తూ పంటలకు నీటిపారుదల అందించామని, తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడబోమని మంత్రి స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

