Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో నూతన విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో నూతన విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మే11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలబట్టడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.

దేశానికి ఆదర్శంగా నూతన విద్యావిధానం ఉండాలన్నదే తమ ప్రయత్నమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రవేశపెడుతున్నామని వివరించారు. పదోతరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్‌లో డ్రాఫౌట్స్ పెరుగుతున్నాయని తెలిపారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఈ రోజు (సోమవారం) రూ.1011 కోట్లతో క్యూర్ ప్రాంతంలో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఈనెల 17వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా విద్యావారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చారు.

అందుకే ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణం..

కులవివక్షను రూపుమాపేందుకే ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కోసం రూ.1700 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.1969 తొలి తెలంగాణ ఉద్యమం, 2009 మలి తెలంగాణ ఉద్యమంలో యూనివర్శిటీల విద్యార్థులు ఉవ్వెత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని ప్రస్తావించారు. తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, నిధులు, నియామకాలు, రాజకీయ ప్రాతినిధ్యంపైన ఉస్మానియా, కాకతీయ విద్యార్థులు ఉద్యమ బాటన నడిచారని చెప్పుకొచ్చారు. యూనివర్శిటీలు, విద్యను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమాజం బలహీనపడుతుందని అన్నారు. పేదలకు న్యాయమైన విద్య, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం తమ ప్రభుత్వ బాధ్యత అని వ్యాఖ్యానించారు.. తెలంగాణలోని తండాలు, గూడాలు, మారుముల గ్రామాల్లోని పేదలు, దళితులు, గిరిజనులకు విద్యను అందించాలని విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకుని అడుగులు ముందుకు వేస్తున్నామని తెలిపారు.. 11000 ఉపాధ్యాయ నియామకాలను 60 రోజుల్లో పూర్తిచేశామని పేర్కొన్నారు.

టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం..

22 వేల టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం. టీచర్ల బదిలీలు అంత ఆషామాషీ కాదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 36 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా చేశామని వివరించారు. నీతి ఆయోగ్ విద్యాశాఖలో మన రాష్ట్రం సాధించిన విజయాలను అభినందించిందని చెప్పారు. విద్యాశాఖ ఉద్యోగులు, టీచర్లను అభినందిస్తున్నానని అన్నారు. 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షల పేద విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. 1.5 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. తెలంగాణలో 17 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారని వెల్లడించారు. 12 వేల ప్రైవేట్ స్కూల్స్ ఉంటే 38 లక్షల మంది చదువుతున్నారని చెప్పారు. ప్రైవేట్ స్కూల్స్‌లో ఉన్న గొప్పతనం ఏమిటీ.. ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న లోపం ఏమిటో..? పరిశీలించుకోవాలని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 8 శాతం నిధులను విద్య కోసం కేటాయించామని తెలిపారు. వచ్చే ఏడాది విద్యకు అధికంగా నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. 15 శాతానికి క్రమంగా పెంచుతామని వివరించారు. 25 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను విద్యావిధానం పరిశీలనకు ఫిన్లాండ్ దేశానికి పంపించామని ప్రస్తావించారు. అలాగే, అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి 500 మందిని విదేశాలకు పంపిస్తామని అన్నారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించే టీచర్లను అభినందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఉద్ఘాటించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున టీచర్లను సన్మానిస్తామని చెప్పుకొచ్చారు. పేద విద్యార్థులు ఆర్థాకలితో పాఠశాలలకు వస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన భోజనం అందిస్తామని స్పష్టం చేశారు. పాఠశాల విద్యార్థులకు పాలు, రాగిజావ అందిస్తామని ప్రకటించారు. కొడంగల్‌లో ఫైలెట్ ప్రాజెక్టుగా పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామని ప్రస్తావించారు. ప్రభుత్వం పాఠశాల్లో చదివే విద్యార్థులు తమ పిల్లలతో సమానమని అన్నారు. తల్లిదండ్రుల్లా తమ ప్రభుత్వం విద్యార్థులను జాగ్రత్తగా చూసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

యూనివర్శిటీలల్లో సదుపాయాలు కల్పిస్తాం..

200 శాతం కాస్మోటిక్ ఛార్జీలు, 40 శాతం డైట్ ఛార్జీలు పెంచామని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రేపటి తెలంగాణ ప్రభుత్వ పాఠశాల గదుల్లోనే ఉందని తాము భావిస్తున్నామని అన్నారు. విద్యాశాఖపైన పెట్టే ఖర్చును భవిష్యత్తు తరాల పెట్టుబడిగా భావిస్తున్నామని తెలిపారు. యూనివర్శిటీలల్లో సదుపాయాల కల్పన కోసం వందలాది కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నామని వివరించారు. 100 నియోజకవర్గాల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లను రూ.20 వేల కోట్లతో నిర్మిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలోని పేదల బిడ్డలు ధైర్యంగా గుండెపైన చేయి వేసుకుని యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లలో చదువుకున్నామని చెప్పాలన్నదే తన ధ్యేయమని ఉద్ఘాటించారు. తామంతా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్నామని.. ప్రభుత్వ పాఠశాలలు అనాథ శరణాలయాలు కాదని.. అభివృద్ధి వేదికలని వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని తెలిపారు. పాఠశాలలు టీచర్లు, ఐఏఎస్‌లు, రాజకీయ నాయకుల కోసం కాదని...పేద విద్యార్థుల కోసమని చెప్పుకొచ్చారు. పేదలకు మేలు జరిగే ఏ నిర్ణయమైనా తాము వెనకడుగు వేయకుండా తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇచ్చే ఎడ్యూకేషన్ కిట్ నాణ్యతను తానే స్వయంగా పరిశీలించానని ప్రస్తావించారు. పుస్తకాలు, నోట్ పుస్తకాలు సరైన సమయంలో విద్యార్థులకు చేరాలని సూచించారు. పాఠశాల ప్రారంభమయ్యే రోజే విద్యార్థులకు ఒక జత స్కూల్ డ్రెస్‌ను అందజేస్తున్నామని.. మరో జత నెలాఖారున ఇస్తామని అన్నారు. ఎడ్యూకేషన్ కిట్ కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

అలా చేస్తే చర్యలు తీసుకుంటా..

నాణ్యమైన వస్తువులు రాకపోతే తక్షణమే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. నాణ్యత లేని వస్తువులను సప్లై చేసే ఆయా కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టి చర్యలు తీసుకునే బాధ్యత తనదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూటికి నూరు శాతం మార్కులు రావాలన్నదే తన కల అని చెప్పుకొచ్చారు.. టీచర్లకు మొదటి తేదీన జీతంతో పాటు మౌలిక సదుపాయలు కల్పించే బాధ్యత తనదని తెలిపారు. ప్రభుత్వ టీచర్లు బాధ్యతతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. 19 లక్షల మంది విద్యార్థుల కుటుంబాల భవిష్యత్తు ప్రభుత్వ ఉపాధ్యాయుల చేతిలో ఉందని అన్నారు. పేద తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలంటే టీచర్లు ఒక గంట అదనంగా పని చేయాలని సూచించారు. తెలంగాణ విద్యావిధానాన్ని దేశానికే ఆదర్శంగా నిలబడేలా ముందుకు సాగుదామని ఉద్ఘాటించారు. విద్యాశాఖకు మంత్రి లేరని కొందరు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సమీక్షా సమయంలో తనను ముఖ్యమంత్రిగా కాకుండా విద్యాశాఖ మంత్రిగా చూడాలని సూచించారు. కావాలనే తాను విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నానని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యను అందించి.. బాధ్యత కలిగిన పౌరులను దేశానికి అందించాలన్నదే తన ఉద్దేశమని ఉద్ఘాటించారు. త్వరలోనే విద్యా శాఖలో మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy